తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు దుమారం రేపుతున్న వేళ ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ లేదని.. అది పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసిన నెయ్యి కావచ్చని అన్నారు. ఆవాలు, అవిసెలు,, పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవుల పాల నుంచి తయారు చేసిన నెయ్యి కూడా అయ్యి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. తమపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. పరీక్షలో కచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని ఎస్డీబీబీ తన నివేదికలో తెలిపిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఉన్న లోపాలు ఏంటి? జరిగిందేంటి? అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఎంతో భద్రతగా చేయాల్సిన ఈ పనిని అల్లరి చేస్తే మన దేవుడి విలువను మనమే తగ్గించుకున్నట్లు అవుతుందని విమర్శించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ విషయంలో వివాదాలకు పోకుండా ఉండాలని సలహా ఇచ్చారు.