AP News | పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పందించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. నెల్లూరులో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్‌స్వీప్ చేసేలా కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తన మీద తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని.. నాన్‌స్టాప్ కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు. అధికారం చేతిలో పెట్టుకుని.. తనపై అక్రమ కేసులు పెట్టించి శునకానందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి.. భరిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు.
నాలుగు కేసులు పెట్టినంత మాత్రాన భయపడతామని అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదని అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వంలో ఇలాగే కేసులు పెట్టాలనుకుంటే ఇంతకన్నా ఎక్కువ కేసులు అయ్యేవని.. కానీ తాము అలా చేయలేదని స్పష్టం చేశారు.