Ap Elections | ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన- బీజేపీ కూటమి హవా కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిగ్ ఫిగర్‌ను దాటి అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీకి ఘోర పరాభవం తప్పలేదు. గత ఎన్నికల్లో ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి..’, ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.
175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో వైసీపీ కేవలం సింగిల్ డిజిట్లో మాత్రమే ఆధిక్యంలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ పార్టీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతోందో. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. వైసీపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకూ ఒక్కచోట కూడా ఖాతా తెరవలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 150కిపైగా సీట్లు సాధించిన వైసీపీకి ఈ ఎన్నికల్లో తీవ్ర భంగాపాటనే చెప్పాలి.
ఇక ఈ సారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకు అనుగుణంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా మార్చారు. అయినా ఫలితం లేకపోయింది. మార్చిన అందరు అభ్యర్థులూ ఓడిపోయారు. దీంతో ఎన్నికలకు ముందు ‘వై నాట్ 175’ అన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. ఇక వైసీపీ నేతల వారసులు అంతా ఓడిపోవడం గమనార్హం. వారితోపాటు పలువురు మంత్రులు, కీలక నేతలు సైతం ఓటమిపాలయ్యారు.
ఈ సారి పలువురు వైసీపీ సీనియర్ నేతలు తమకు బదులు తమ వారుసులకు సీట్లు ఇప్పించుకుని ఎన్నికల బరిలోకి దింపారు. అయితే, ఒక్కరు కూడా గెలవలేదు. వీరిలో.. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందర్లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి ఉన్నారు. వీరంతా కూడా ఓటమిపాలయ్యారు.
ఇక జగన్ సర్కార్ కేబినెట్లోని మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఒక్క పెద్ది రెడ్డి తప్ప అంతా ప్రత్యర్థుల చేతుల్లో ఘోర ఓటమిని చవిచూశారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజిని, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, జోగి రమేశ్, ఆర్కే రోజా సహా పలువురు మంత్రులు, కీలక నేతలు ఇప్పటికే ఓడిపోయారు.
Also Read..
Pawan Kalyan | పగిలే కొద్దీ పదునెక్కిన గాజు.. పవన్ కల్యాణ్ విక్టరీ విజయం
Balakrishna | హిందూపురంలో హాట్రిక్ దిశగా నందమూరి బాలకృష్ణ
Bandla Ganesh | ‘జబర్దస్త్ పిలుస్తోంది రా.. కదలిరా’.. నటి రోజా ఫొటోతో బండ్ల గణేశ్ ‘ఎక్స్’ పోస్ట్