గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఏపీ రాష్ట్ర సాంకేతిక విద్యావిభాగం 2022 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఈ, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ప్రాసెసింగ్ ఫీ చెల్లింపు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఇవ్వాల్టి నుంచి ఈ నెల 30 వరకు అనుమతించనున్నారు. సెప్టెంబర్ 12 నుంచి తరగతులు ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. షెడ్యూల్లో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 ప్రాసెసింగ్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ల ఆన్లైన్ వెరిఫికేషన్ నోటిఫైడ్ హెల్ప్‌లైన్ సెంటర్లలో ఆగస్టు 23 నుండి 31 వరకు జరుగుతుంది. రిజిస్టర్డ్, అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను సెలక్ట్ చేసుకోవడం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు, వెబ్ ఆప్షన్ల మార్పు సెప్టెంబర్ 3 న అనుమతిస్తారు. సెప్టెంబర్ 6న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 6 – 12 తేదీల మధ్య సంబంధిత కళాశాల్లో అనుమతి ప్రవేశపత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
కాగా, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో-ఇండియన్ క్యాటగిరీల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 27న 1 నుంచి 50,000 ర్యాంకర్లు, ఆగస్టు 28 న 50,001 నుంచి 90,000 ర్యాంకర్లు, ఆగస్టు 28 న క్యాప్ అభ్యర్థులు 1 నుంచి 40,000 ర్యాంకర్లు, క్రీడల అభ్యర్థుల కోసం 90,000 నుంచి 1,40,000 ర్యాంకర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆగస్టు 29 న జరుగనున్నది. క్యాప్ కోసం 40,001 నుంచి 90,000 ర్యాంకులకు ఆగస్టు 29 న, 90,001 ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు ఆగస్టు 30 న వెరిఫికేషన్ ఉంటుంది. ఆంగ్లో-ఇండియన్ అన్ని ర్యాంకుల వారికి ఆగస్టు 31న వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం ఏపీ సాంకేతిక విద్యా శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.