అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతి వార్త తనను షాక్ గురి చేసిందని జగన్ పేర్కొన్నారు. ఓ మంచి యువ నాయకుడిని పార్టీ కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. గౌతమ్ రెడ్డి చిన్నపట్నుంచే తనకు తెలుసన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావడంతో.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారిన పడ్డ గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు.