Polavaram | పట్టుబట్టి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేలా చేశానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సోమవారం చంద్రబాబు సందర్శించారు. అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టును కలియదిరిగారు. అక్కడి పరిస్థితులపై విచారం వ్యక్తం చేశారు. పోలవరంపై పరిస్థితులపై సమీక్షించిన ఆయన.. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 72శాతం పనులు పూర్తయితే.. ఐదేళ్లలో నాశనం చేశారంటూ మండిపడ్డారు. ప్రాజెక్టు ఏపీకి ఒకవరమని భావించి ఆ రోజున శ్రద్ధ వహించామని.. ప్రాజెక్టును పూర్తిచేసి నదులను అనుసంధానం చేయగలిగితే కరువనే మాట లేకుండా పోతుందన్న ఆలోచనతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామన్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని.. ఢిల్లీలో ఎన్డీయే కూటమి గెలిచిందని.. తనకున్న అనుభవం, ముందుచూపుతో పోలవరంపై ముందడుగువేశామన్నారు. ఆ సమయంలో పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయన్న ఆయన.. ఆ మండలాలు ఏపీకి ఇవ్వకపోతే పోలవరం ముందుకెళ్లే పరిస్థితి లేదన్నారు. 2014లో జూన్ 2న రెండు రాష్ట్రాలు విడిపోయి నోటిఫై అవుతాయన్న ఆయన.. ఒక్కసారి నోటిఫై అయ్యాక.. తెలంగాణ ఒప్పుకుంటేనే ఆ ఏడు గ్రామాలు ఏపీలో కలుస్తాయని.. అందుకే, రెండు రాష్ట్రాలు నోటిఫై కాకముందే పట్టుబట్టి మరీ కేంద్రంతో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసేలా చేశానని.. రాష్ట్రపతికి నచ్చచెప్పి ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చామని.. దేశ చరిత్రలో ఇలా జరుగడం ఇదే ప్రథమమన్నారు.
ఆ ఆర్డినెన్స్ ద్వారానే ఏడు మండలాలు ఏపీలో కలిశాయని.. ఆ మండలాలతోనే పోలవరం ప్రాజెక్టును కట్టగలిగామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని.. 2005లో ఈ ప్రాజెక్టును వైఎస్ ప్రారంభించగానే.. అవకతవకలు జరిగాయని.. కాంట్రాక్టులను రద్దు చేయడంతో ప్రాజెక్టు అటకెక్కిందన్నారు. రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ తవ్వకాల అంశంపై కొందరు కోర్టుకెళ్లారని.. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో టెండర్లు పిలిచినా.. చివరికి 2014లో రాష్ట్ర విభజన జరిగాక దీన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజనచట్టంలో చేర్చారన్నారు. 1940 ప్రాంతంలోనే బ్రిటీష్ వారు ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారని.. అప్పటి నుంచి ఇది ముందుకీ, వెనక్కీ ఊగిసలాడుతోందన్నారు. అప్పట్లో 300 నుంచి 700 టీఎంసీల సామర్థ్యంతో బాగా ఎత్తు పెంచి కట్టాలనుకున్నారని.. కానీ, చివరికి 45.72 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీల సామర్థ్యంతో పోలవరం సాధ్యమందని చెప్పారు.
తన బాధ ఏంటంటే.. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి.. రాష్ట్రానికి ఓ శాపంలా మారాడని.. అందుకు పోలవరమే ఉదాహారణ అన్నారు. ఇది ఓ కేస్ స్టడీ వంటిదని.. ఇలాంటివి చాలానే జరిగాయన్నారు. పోలవరం విషయంలో జరిగిందని చిన్నతప్పు కాదని.. క్షమించరాని నేరమన్నారు. ఇప్పటి వరకు 30సార్లు పోలవరాన్ని సందర్శించానని.. ఇది 31వ సారి వచ్చానన్న ఆయన.. తనమనసంతా ఈ ప్రాజెక్టుపైనే ఉందన్నారు. తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తూనే రివర్స్ టెండరింగ్ పేరుతో కంపెనీలను పంపించేశారని.. సిబ్బందినంతా మార్చేశారని.. ఎవరికీ తెలియని వ్యక్తులను పోలవరంలో తీసుకువచ్చి పెట్టారన్నారు. ప్రాజెక్టు పనులు కొనసాగి ఉంటే.. 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయై ఉండేదని అధికారులు చెప్పారని.. ఐదేళ్లు గడిచిపోయాయన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే… కనీసం నాలుగు సీజన్లు కావాలని అంటున్నారని.. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లన్నారు. ఒక వ్యక్తి రాష్ట్రానికే శాపంలా ఎలా మారతాడనేదానికి ఇదే ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు.