Chandrababu | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు ప్రజలు ఓజీ సినిమా చూశారని.. దసరా పండుగను చేసుకున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త కళ వచ్చిందని చెప్పారు. ఇవాళ ఆటో డ్రైవర్ల పండుగలో ఉన్నామని చెప్పారు. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు రూ.436 కోట్లను అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోలేదని అన్నారు. 2024 ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడనివి అని అన్నారు. 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిపించారని పేర్కొన్నారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం మంచి పనులు చేస్తోందని తెలిపారు. 15 నెలల కూటమి పాలనలో అనేక పథకాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పారు. ఇప్పుడు రోడ్లు బాగుపడ్డాయి.. ప్రయాణాలకు ఇబ్బంది లేదని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
ఆటో డ్రైవర్లలో చాలామంది పేదవాళ్లే ఉంటారని చంద్రబాబు అన్నారు. ఏడాదికి రూ.15వేలు ఇస్తే వారికి కొంత ఊరటగా ఉంటుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో డబ్బులు రాని వారు ఎవరో తెలియజేస్తే వారికి డబ్బులు ఇచ్చే బాధ్యత తనదే అని అన్నారు. డ్రైవర్లకు అనేక కష్టాలు ఉండేవని చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో గతుకుల రోడ్లతో ఆటోలతో పాటు డ్రైవర్ల ఒళ్లు హూనమయ్యేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గతుకులే గతుకులు అని.. మన ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ రానివ్వమని చెప్పారు. రూ.3400 కోట్లతో రోడ్లన్నీ బాగు చేస్తున్నామని చెప్పారు. ఇకపై రోడ్లపై గుంతలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని ఆటోడ్రైవర్లకు సూచించారు. జరిమానాల జీవో రద్దు చేస్తామని ప్రకటించారు. సీసీటీవీలో అంతా రికార్డు అవుతుంది కాబట్టి సరిగ్గా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని అన్నారు. ఆటో వాళ్ల సంక్షేమం కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.