AP News | ఏపీలోని జిల్లాల పేర్ల మార్పులు చేర్పుల కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు చేర్పులకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఏడుగురు మంత్రులు సభ్యులుగా ఉండనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మంత్రివర్గ ఉపసంఘంలో ఉండనున్నారు. దీనికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారని తెలిపింది. జిల్లా రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ఏపీ ప్రభుత్వం సూచించింది.
సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని, జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సరిహద్దులు నిర్ణయించాలని తెలిపింది. సరిహద్దులు, పేర్లపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.