అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి పాలసీ (Industrial Development Policy) 4.0 కు రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది. వీటితో పాటు మరికొన్ని పాలసీలకు గ్రీన్ సిగ్నల్ తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానంపై సుదీర్ఘంగా చర్చించింది.
ఈ సందర్భంగా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి ఆమోదం ప్రకటించింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని ఖరారు చేసింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా విధానాన్ని ప్రకటించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపైనా చర్చ జరిగింది. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కేబినెట్ఆమోదం తెలిపింది.
2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో ఎంఎస్ఎంఈ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్తపాలసీపై చర్చ జరిగింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకం, ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపై చర్చ జరిగింది.