AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ మొదట్నుంచి చెబుతున్నప్పటికీ.. ఇప్పుడు బీజేపీ మాత్రం తమ నిర్ణయంలో వెనుకడుగు వేసినట్లు కనిపిస్తుంది. టీడీపీతో కలిసి వెళ్లడంలో సందిగ్ధత వ్యక్తం చేస్తున్నట్లు అనిపిస్తున్నది. ఈ సందేహాలకు తమకు పొత్తులు అవసరం లేదని.. పొత్తులు కోరుకునే వాళ్లే తమతో చర్చలకు రావాలని బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చింది. ఈ క్రమంలో జనసేనతో పొత్తుపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్‌తో భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనసేన తమ మిత్రమే పక్షమేనని స్పష్టతనిచ్చారు.
టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత తొలిసారిగా గురువారం బీజేపీ నాయకులతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈ భేటీ అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్‌ను కలవడం కోసమే నాదెండ్ల మనోహర్ వచ్చారని ఆమె తెలిపారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామని పేర్కొన్నారు. పొత్తులపై అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు. ఇక నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. శివప్రకాశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. పొత్తులపై మాట్లాడే సమయం ఇది కాదని.. మరోసారి అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు.