బలహీన వర్గాలకు పెద్దపీట అన్నది వైసీపీ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదేదో డొల్ల విధానం కాదని, గత ప్రభుత్వాలు చేసిన మాదిరి కాదని ఎద్దేవా చేశారు. ఏపీ తరపున నలుగురు రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇలా జరగలేదని, ఇదో అరుదైన ఘట్టమని చెప్పుకొచ్చారు.
మొత్తం నలుగురు రాజ్యసభ అభ్యర్థులను నామినేట్ చేయగా.. అందులో ఇద్దరు బీసీలని సజ్జల అన్నారు. గత రాజ్యసభ ఎన్నికల్లోనూ తాము బీసీలకు ఛాన్స్ ఇచ్చామని, ఒకరు మోపిదేవి రమణ, మరొకరు పిల్లి సుభాస్ చంద్రబోస్ అని గుర్తు చేశారు. ఇలా ఇద్దరు బీసీలకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా.. సీఎం జగన్ మనసులో బీసీలకు ఎంత స్థానం వుందో అర్థమవుతుందన్నారు. బహుశః బీసీ ముఖ్యమంత్రి ఉన్నా.. ఇలా జరిగేది కాదేమోనని సజ్జల అన్నారు.
ఆర్. కృష్ణయ్య బీసీలకు ఓ సింబల్ అని సజ్జల అభివర్ణించారు. బీసీ కులాలన్నింటినీ ఆయన ఏకతాటిపైకి తెచ్చారని, బీసీల కోసం నిలబడ్డారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని, అలాంటి వారిని రాజ్యసభకు పంపి, అక్కడ వాయిస్ వినిపిస్తే బాగుంటుందన్న దృక్పథంతోనే ఆర్. కృష్ణయ్యను ఎంపిక చేశామని సజ్జల వివరించారు.
ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డికి మరోసారి సీఎం జగన్ ఛాన్స్ ఇచ్చారు. ఇక… ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావును రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారని బొత్స వెల్లడించారు.