Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జెత్వానీ ఐఫోన్లను తెరిపించేందుకు ఆమె సన్నిహితుడిపై మరో తప్పుడు కేసు పెట్టినట్లుగా తెలిసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన కాదంబరి జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను ముంబై నుంచి తీసుచ్చిన తర్వాత 4వ తేదీన విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. దీంతో 10 నుంచి 14వ తేదీ వరకు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. కాదంబరి జెత్వానీని అరెస్టు చేసిన సమయంలో ఆమెకు సంబంధించిన ఐదు ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఉన్న ఆధారాలను తుడిచివేయడానికి పాస్వర్డ్లు చెప్పాలని ఆమెపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఆమె ఆ వివరాలు వెల్లడించలేదు. ఎంత ఒత్తిడి చేసినా ఆమె పాస్వర్డ్లు చెప్పడం లేదన్న విషయాన్ని కుక్కల విద్యాసాగర్‌కు చేరవేశారు.
అప్పుడు కాదంబరి జెత్వానీకి ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ అనే వ్యక్తితో మంచి పరిచయాలు ఉన్నాయని.. ఆయన్ను తీసుకొస్తే ఆటోమేటిగ్గా అన్ని వివరాలు చెబుతుందని పోలీసులకు కుక్కల విద్యాసాగర్ సలహా ఇచ్చాడు. దీంతో ఎలాంటి ఆధారం లేకుండా అమిత్ సింగ్‌ను ఢిల్లీ నుంచి తీసుకొస్తే వివాదం రేగుతుందని భావించి పోలీసులు మరో స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 11న బెజవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఒక స్పా కేంద్రంలో సోదాలు చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందంటూ మణిపూర్‌కు చెందిన కొందరు యువతులపై కేసు నమోదు చేశారు.
అందులో స్పా సెంటర్ నిర్వాహకురాలు తమాంగ్(మణిపూర్)ను ఏ 1గా చేర్చారు. విటుడిగా పేర్కొంటూ ఏ 2గా అమిత్ సింగ్‌ను ఇరికించారు. అతను ఢిల్లీ నుంచి ఇక్కడకు మహిళలను సరఫరా చేస్తున్నారని అభియోగాలు నమోదు చేశారు. ఈ తప్పుడు కేసును అడ్డుపెట్టుకుని అమిత్‌ను అరెస్టు చేసేందుకు ఆఘమేఘాలపై నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు ఢిల్లీ వెళ్లేందుకు సీపీ కార్యాలయం నుంచే టికెట్లను బుక్ చేశారు. కానీ ఢిల్లీ వెళ్లిన తర్వాత అమిత్ సింగ్ ఆచూకీ దొరక్కపోవడంతో వెనక్కి తిరిగొచ్చారు. ఈలోగా కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.