అమరావతి : ఆంధ్రప్రదేశ్ అమరావతికి మరో 16 వేల ఎకరాలు భూ సేకరణ చేపట్టాలని ( Land acquire ) ప్రభుత్వం నిర్ణయించడం అసంబద్ధంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు (Vadde Shobhanadriswara Rao) ఆరోపించారు. శనివారం విజయవాడలో అమరావతి రెండో విడత భూ సమీకరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్( Round Table ) సమావేశంలో పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొని మాట్లాడారు .
ఇప్పటికే రైతుల వద్ద సేకరించిన 34 వేల ఎకరాల భూములపై ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీనవేషాలు వేస్తున్న ప్రభుత్వం మరో 16 వేల ఎకరాల సేకరణ వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినప్పటికీ వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ తయారు చేసిన మాస్టర్ ప్లాన్లో అనేక లోపాలున్నాయని విమర్శించారు. మూడు ఏళ్లలో మౌలిక సదుపాయాలు అందిస్తామని అగ్రిమెంట్ చేసినా అమలు కాలేదని దుయ్యబట్టారు. అమరావతి రైతుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ఆగ్రహం చేశారు.
అమరావతిలో రెండు లక్షల జనాభా కూడా లేకపోయినా వెయ్యి ఎకరాల్లో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెప్పి భూములు సేకరిస్తుండడం విచారకరమని పేర్కొన్నారు. రెండో విడత భష్త్ర సమీకరణపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు. రియల్ స్టేట్ వ్యాపారం కోసమే రెండో విడత భూ సేకరణ అని ఆరోపించారు.