TTD | తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని తీసుకువచ్చింది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ లక్కీ డీప్ సిస్టమ్ ద్వారా విడుదల చేయనున్నది. డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ఎంపికైన భక్తులకు టోకెన్లు జారీ చేయనున్నారు. శుక్రవారం మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారం 500 టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఒకసారి ఈ సేవలో పాల్గొన్న భక్తులు మళ్లీ ఈ సేవలో పాల్గొనేందుకు గడువు 90 నుంచి 180 రోజులకు పెంచింది. ఈ మేరకు మార్పులను గమనించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన తదితర సేవల కోసం టీటీడీ లక్కీ డిప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ లక్కీ డిప్లోనే అంగప్రదక్షిణం టోకెన్లు చేర్చింది. గతంలో ప్రత్యేకంగా టికెట్లు జారీ చేస్తూ ఉండేది.