Actress Roja : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైరయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అందుకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. జనాలను మోసం చేసినట్లు శ్రీవారిని మోసం చేస్తే కుదరదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని రోజా వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో గెలువాలనే లక్ష్యంతో చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారన్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంపై తాము సీబీఐ విచారణ కోరుతున్నామని.. గతంలో కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని, సీబీఐ, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు.