హైదరాబాద్: ఒడిశాలోని (Odish) బాలేశ్వర్ (Baleshwar) సమీపంలోని బహనాగ్‌బజార్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో (Odisha Train accident) పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhrapradesh) చెందినవారు ఉన్నట్లు తెలుస్తున్నది. షాలిమార్ నుంచి చెన్నై వస్తున్న (Shalimar-Chennai Central) కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express), యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వస్తున్న సూపర్ ఫాస్ట్ (Bengaluru-Howrah Superfast Express) రైళ్లు శుక్రవారం సాయంత్రం బాలేశ్వర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తెగువారు ఎక్కువ మంది ఉన్నట్లు రైల్వే అధికారుల వద్ద ఉన్న జాబితాను బట్టి తెలుస్తున్నది.
రైలులో షాలిమార్, ఖరగ్‌పూర్, సంత్రగచ్చి, బాలేశ్వర్ స్టేషన్లలో ఎక్కిన ప్రయాణికుల్లో రాజమండ్రిలో 22 మంది, విజయవాడలో 47 మంది, ఏలూరులో ఒకరు మొత్తంగా 70 మంది దిగాల్సి ఉన్నది. ఇదే రైలులో రాజమండ్రి స్టేషన్ నుంచి 56 మంది, తాడేపల్లిగూడలో 10 మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కారు. వారంతా చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు టికెట్లు రిజర్వు చేసుకున్నారు.
ఇక కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్ల మీదుగా వెళ్లింది. అయితే తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్ల నుంచి ఖరగ్‌పూర్, హౌరా వైపు 52 మందికిపైగా ప్రయాణికులు వెళ్లినట్లు తెలుస్తున్నది.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థాలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఒడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రైలు బోగీల్లో చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులను దవాఖానలకు తరలించేందుకు 200 అంబులెన్సులను ఒడిశా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఘటనా స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదానికి గురైన రైళ్లలోని ప్రయాణికులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి రైల్వే అధికారులు హెల్స్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.