అమరావతి : ప్రమాదం ఏ మూలన నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు పంటపొలాల్లో ఎండలో పనిచేసి రోడ్డుపక్కన నిలిపిన ట్రాక్టర్ కింద నీడలో సేద తీరడానికి వెళ్లారు. ముగ్గురు భోజనం చేస్తుండగా టిప్పర్ రూపంలో వచ్చిన ప్రమాదానికి గురై మృతిచెందడం వారి కుటుంబాల్లో విషాదం నింపింది. ఏపీలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆగివున్న ట్రాక్టర్ను టిప్పర్ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ట్రాక్టర్ కింద కూర్చొని రైతులు భోజనం చేస్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు రైతులతో పాటు టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.