రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పరిశీలించారు.
అనంతరం నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. పేదల కల నెరవేరాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు గతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 80 శాతం పూర్తయిన టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను పూర్తి చేయకుండా.. వైసీపీ ప్రభుత్వంలో ఆ ఇళ్లకు రంగులు వేశారని అన్నారు. రంగులు వేయడంలో చూపిన శ్రద్ధ.. పెండింగ్లో ఉన్న 20 శాతం పనులు పూర్తి చేయడంలో పెట్టలేదని మండిపడ్డారు.
చంద్రబాబు హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి 5 వేల కోట్ల రూపాయలను అప్పటి సీఎం జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి నిమ్మల విమర్శించారు. ఇళ్లను తాకట్టు పెట్టిన ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి నెత్తిమీద ఐదారు లక్షల అప్పు పెట్టి దగా చేసిందని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లను అప్పగించకుండానే పేదలు, మహిళలపై గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధించిందని అన్నారు. టిడ్కో ఇళ్లకు పునర్వైభవం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అతి త్వరలో ఇళ్లను అందజేస్తామని పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో మళ్లీ అమరావతిని నిలబెట్టేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని వెల్లడించారు.