హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ): ఏపీలో ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. మహిళలపై దాడులు పెరిగాయని, లక్షన్నర లబ్ధిదారుల పింఛన్లు కట్ చేశారని ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, డీజీపీ అధికార పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే జమిలి ఎన్నికలు అంటున్నారని, ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తప్పుచేసిన అధికారులు ట్రాన్స్ఫర్, రిటైర్ అయినా దోషులుగా నిలబెడుతామని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ అండగా ఉంటుందని చెప్పారు. రెడ్‌బుక్ టీడీపీ నేతల వద్ద మాత్రమే కాదని, ప్రస్తుతం నష్టపోతున్న ప్రతి బాధితుడూ రెడ్బెక్ పెట్టుకుంటున్నాడని హెచ్చరించారు.