అమరావతి : ఏపీలో కూటమి నాయకులు చేస్తున్న టీటీడీ లడ్డూ (TTD Laddu) వివాదంపై నిష్పక్షపాత విచారణ జరపాలని పిఠాపురం వైసీపీ ఇన్చార్జి వంగా గీత (Vanga Geetha) డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ను రాజకీయంగా ఎదుర్కొన లేక లడ్డూ ప్రసాదంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని గురువారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం నిజనిజాలు తేల్చాలని , సీబీఐ(CBI) లేదా సిట్టింగ్ జడ్జి(Sitting Judge) తో విచారణ జరిపించాలని కోరారు. లడ్డూలో కల్తీ నెయ్యిని ఉపయోగించారన్న ఆరోపణలపై వేసిన సిట్ ను చంద్రబాబు తమకు కావాల్సిన మనుషులతో విచారణ జరిపించడం సరికాదన్నారు. తిరుమల పవిత్రతను, లడ్డూ కల్తీపై చేస్తున్న ఆరోపణల పాప ప్రక్షాళనకు వైసీపీ ఈనెల 28న అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తుందన్నారు.
ఇందులో భాగంగా తిరుమలకు కాలినడకన వెళ్లనున్న వైఎస్ జగన్ ముందుగా డిక్లరేషన్ ఇవ్వాలన్న కూటమి మంత్రుల వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ముందుగా నిజాలు తేలిన తరువాత డిక్లరేషన్ గురించి అడగాలని అన్నారు. ఎలాంటి ఆదారాలు, సాక్ష్యాలు లేకుండా పవిత్రమైన తిరుమల లడ్డూపై తప్పుడు ఆరోపణలు చేయడం సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నారు.