హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తనకు ‘రెండు తెలుగు రాష్ట్రాలు.. రెండు కండ్లు’ అని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు .. రెండు కండ్లు అంటే అర్థమేంటని ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా అని చంద్రబాబును నిలదీశారు. బాబు మాటలు విం టుంటే ఏపీకి ఏదో ద్రోహం తలపెట్టినట్టు అనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదు? అని అంబటి ప్రశ్నించారు.
ఏపీలోని పోర్టులో తెలంగాణ వాటా అడుగుతున్నదని.. టీటీడీ బోర్డు, ఆదాయంలోనూ వాటా కోసం తెలంగాణ పట్టుబట్టిందని పేర్కొన్నారు. తెలంగాణకు వాటా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. పార్టీ పరంగా బాబుకు రెండు రాష్ట్రాలు.. రెండు కండ్లు కావచ్చు. కానీ, ఏపీ ప్రభుత్వపరంగా చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. విభజన జరిగాక పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దాన్ని వినియోగించుకోకుండా చంద్రబాబు ఎందు కు పారిపోయి వచ్చారు? అని ప్రశ్నించారు.