Srisailam Temple | శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు, మహిమాన్వితుడు, క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి బుధవారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధద్రవ్యాలు, శుద్ధజలాలతో అభిషేకాలు చేశారు. విశేష పుష్పార్చన జరిపి.. మహా నైవేద్యం సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడంతో భూతప్రేత పిశాచ దుష్ట గ్రహదోషాలు తొలిగి సర్వకార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు.
ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో పరోక్షసేవ ద్వార నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్ సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. దేవస్థానం వివరాలను తెలుసుకునేందుకు కాల్సెంటర్ 8333901351, 2, 3, 4, 5, 8 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు. అదే విధంగా సాక్షి గణపతికి, ఆలయ ప్రాకారంలోని జ్వాలా వీరభద్రస్వామికి వార పూజలు జరిపించి భక్తుల దర్శనాలకు అనుమతిచ్చినట్లు ఈవో తెలిపారు. ఆలయ మాడవీధిలోని కళారాధన వేదికపై ధర్మవరానికి చెందిన శ్రీలలితా కళానికేతన్ బృందం వారిచే జరిగిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి.