అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నేటితో ముగిసింది. అలిపిరిలోని శ్రీవారి పాదాల చెంతకు ఈ యాత్ర చేరగానే యాత్రకు సంబంధించిన ప్రతినిధులు కొబ్బరి కాయలు కొట్టి యాత్రకు ముగింపు పలికారు. ఈ సమయంలో రైతులు జై అమరావతి… జైజై అమరావతి.. అంటూ నినాదాలు చేయడంతో అలిపిరి ప్రాంతమంతా అమరావతి నినాదాలతో హోరెత్తింది. మరోవైపు బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రతి రోజూ 500 మంది రైతులకు శ్రీవారి దర్శనం భాగ్యం కలిగించాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. మరోవైపు అమరావతే రాజధానిగా ఉండాలన్న తమ ఆకాంక్ష వ్యక్తమయ్యేలా ఈ నెల 17న తిరుపతి వేదికగా ఓ భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని ప్రతినిధులు ప్రకటించారు.
‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో నవంబర్ 1 నుంచి రైతులు తుళ్లూరు నుంచి ఈ మహా పాదయాత్రను చేపట్టారు. 44 రోజుల పాటు ఈ యాత్ర సాగింది. గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల గుండా ఈ యాత్ర సాగింది. 45 వ రోజు అలిపిరిశ్రీనివాసుడి పాదాల చెంత ఈ మహా పాదయాత్రను రైతులు ముగించారు.