హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో ఏపీ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. కేసును క్వాష్ చేయాలని కోరారు. మే 11న అల్లు అర్జున్ నంద్యాల మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు.
సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడంపై కొందరు ఫిర్యాదు చేయగా, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై కొరడా ఝుళిపించింది. నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించడం, నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడంతో అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పారవిపై నంద్యాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.