తిరుమల : ఏపీ కూటమి నేతలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మున్నెన్నడూ లేని విధంగా తిరుమలలో దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు టికెట్లు (Tirumala Tickets) అమ్ముకుంటు సంపదను సృష్టించుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
కూటమి అధికారంలోకి (Allaiance Leaders) వచ్చాక తిరుమలలో ఏదో ఒకటి అపచారం జరుగుతుందని, అధికారుల అలసత్వం, అవినీతి విచ్చల విడిగా కనిపిస్తోందని ఆరోపించారు. కూటమి నాయకుల అండ చూసుకుని ఎర్రచందనం (Red Sandal) స్మగ్లింగ్ జోరుగా జరుగుతుందని, ఇటీవల నాలుగుసార్లు తిరుమలలో ఎర్రచందనం దొరికిందని పేర్కొన్నారు.
ఏడుకొండల స్వామి కొలువుదీరిన ప్రాంతంలో మద్యం( Liquor) , బిర్యానీలు (Biryani) లభ్యమవుతున్నాయని, మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చాక తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేస్తున్నారని కేంద్రం గుర్తించిందని అన్నారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనల నిగ్గు తేల్చేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి దర్యాప్తుకు ఆదేశించగా రాత్రికి రాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందని ఆరోపించారు.