అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant ) లో ఘోర ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించిన తీరు దారుణంగా ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) అన్నారు. బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చూపుతుందని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్సపొందు తున్న బాధితులను బుధవారం వైసీపీ నాయకులతో కలసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులకు కేంద్రమే పరిహారం ప్రకటించగా రాష్ట్రం ఇంకా ప్రకటించలేదని అన్నారు. వైసీపీ హయాంలో బాధితులకు వెంటనే కోటి రూపాయల పరిహారాన్నిఅందించిన విషయాన్ని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం బాధితులకు కోటి ప్రకటించి బాధిత కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని తాము అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు ప్రధానికి లేఖలు రాశామని తెలిపారు. దాని ఫలితంగానే ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయిందని అన్నారు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, నాలుగు నెలల జీతాలు చెల్లించలేదని విమర్శించారు. ప్రమాదంలో 9 మంది చనిపోవడం, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమని జగన్ పేర్కొన్నారు.