తిరుపతి : దేశంలో ఉన్న అన్ని వేద పాఠశాలలను ఏకీకృతం చేసి వేద విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాల కులపతి, టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగ ఫలితమే ఈనాటి అమృతోత్సవమన్నారు.
వేద విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఉచితంగా కల్పిస్తున్నామని, విద్యార్థులు బాగా చదువుకుని విజ్ఞానవంతులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. 2009 నుంచి ఉన్న అడహాక్ లెక్చరర్ల సమస్యను పరిష్కరిం చి, వారిని పర్మినెంట్ చేశామని, 2009 నుంచి వారి సర్వీసులు గుర్తిస్తున్నామని, అధ్యాపకులు బోధన-పరిశోధన అంశాలలో రాజీ పడకుండా కృషి చేయాలన్నారు.
ఈ సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ పటిష్ఠంగా నిర్మించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎవి.రాధేశ్యామ్, అకాడమిక్ డీన్ డాక్టర్ ఫణియజ్ఞేశ్వర యాజులు, సంచాలకులు డాక్టర్ సీతారామారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.