Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రధానంగా రద్దీ రోజులుగా భావించే శని, ఆది, సోమవారాల్లో స్వామి వారి గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
అమ్మవారి అంతరాలయంలో జరిపించే కుంకుమార్చనలు కూడా ప్రాకార మండపంలోనే నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. మృత్యుంజయ హోమం, రుద్రహోమం, చండీ హోమాలు రోజుకు రెండు విడతలుగా జరిపిస్తూ టికెట్లు ఆన్లైన్లో మాత్రమే కేటాయిస్తున్నట్లు తెలిపారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నప్పుడు మంచినీరు, పాలు, బిస్కెట్లు, అల్పాహారాలు అందించడంతోపాటు నిరంతర అన్నదాన వితరణ కొనసాగిస్తున్నామన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులు ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న కోరారు. అలాగు పౌర్ణమి రోజున జరిగే కార్యక్రమాలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైల శ్రీభ్రమరాంబ అమ్మవారికి నిత్య పూజా కైంకర్యాలలో వినియోగానికి వీలుగా కర్నూలు వాసి రామమోహన్‌రెడ్డి, రమాదేవి వెండి హారతిని విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆలయ అధికారుల సమక్షంలో దాతలు సుమారు 1.160 కిలోల బరువు గల హారతిని వేదపండితుల సమక్షంలో అందజేశారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.