విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమకిచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలంటూ విజయవాడలో ధర్నా చేపట్టారు. ఆగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ చేపట్టారు. పెద్ద సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా చౌక్‌కు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుడారాలు, టెంట్లు వేసి పెద్ద సంఖ్యలో బాధితులు ధర్నాకు దిగారు.
అగ్రిగోల్డ్ సంస్థ మోసానికి గురైన బాధితులు మరోసారి న్యాయం కోసం ఆందోళనకు పూనుకున్నారు. వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చిన బాధితులు ధర్నా చౌక్‌లో నిరసన బైఠాయింపు జరిపారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌మెహన్‌రెడ్డి.. ఇప్పుడు తమ సమస్యను లేవనెత్తడం లేదని విచారం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం హామీ అమలుచేయాలంటూ నినాదాలు చేశారు. బాధితులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి మరిచిపోయారని వారు ఆవేదనతో చెప్పారు.
అగ్రిగోల్డ్ బాధితుల తరపున పోరాడుతున్న సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వర్రావు ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తమకిచ్చిన హామీని అమలుచేయాలని ధర్నాలో కూర్చున్న అగ్రిగోల్డ్ బాధితులు విజ్ఞప్తి చేశారు. తమ అమ్మాయిల వివాహాలు జరిపించలేని దుస్థితిలో ఉన్నామని, ఇకనైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తమను ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.