విజయవాడ: ప్రభుత్వ దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన జీఓ నంబర్ 117 ను తక్షణమే ఎత్తివేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రతిపక్ష టీడీపీతోపాటు ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విలీనం పేరుతో ప్రభుత్వం పాఠశాలలను మూసివేసేందుకు కుట్ర పన్నుతుందని వారు ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసేందుకు జగన్ సర్కార్ కుట్రపన్నిందని వివక్ష టీడీపీ నేతలు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆరోపించారు. విలీనాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 ను తక్షణమే వెనక్కితీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనకాపల్లి నియోజకవర్గంలోనే 35 ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆరోపించారు. కాలనీల్లోనే పాఠశాలలు కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సరఫరా చేసిన బ్యాగులు నాణ్యతగా ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగులను రోడ్డుపై విసిరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన ధర్నాతో గంటకుపైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
అటు నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి నిరసన చేపట్టారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే ఈ ఉత్తర్వులను తీసుకొచ్చిందని ఎస్ఎఫ్ఐ నేత దినేష్ కుమార్ ఆరోపించారు. ఇలాఉండగా, ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం పేర్కొన్నదని, అయితే ప్రాథమిక పాఠశాలలను శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఈ ఉత్తర్వులను తీసుకొచ్చిందని చెప్పారు. వెంటనే 117 నంబర్ జీఓను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జోఓకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఆందోళనలు కొనసాగాయి.