Pawan Kalyan | 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పుడు సర్వస్వం కోల్పోయినట్లు అనిపించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్ర ఆదివారం మలికిపురం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఓటమితో గుండెకోతను అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో మీరిచ్చిన గెలుపే ఓదార్చినట్లు అయ్యిందని అన్నారు. రాజోలు విజయం ఎడారిలో ఒయాసిస్లో అనిపించిందని చెప్పారు. కానీ గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారారని పేర్కొన్నారు.
రాజోలులో మీరు వెలిగించిన ఈ చిరు దీపం.. ఒకరోజు ఏపీలో అఖండ జ్యోతిగా మారుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు దీపం ఒకరోజు రాజంపేట వరకు వెలుగుతుందని పేర్కొన్నారు. 150 మందితో మొదలైన జనసేనకు.. ఇప్పుడు ఒక్క రాజోలులోనే 10274 మంది కార్యకర్తలతో బలంగా ఉందని తెలిపారు. తాను కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కాదని.. అందరినీ కలిపేందుకే వచ్చానని స్పష్టం చేశారు. గోదావరి లాగే ఉభయగోదావరి జిల్లాలను అంటిపెట్టుకుని ఉంటానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. అభివృద్ధి అనేది ఉభయ గోదావరి జిల్లాలతో మొదలుపెడతామని అన్నారు.
రాజోలులో మీరు వెలిగించిన చిరు దీపం ఒక రోజున రాజంపేట దాకా వెలుగుతుంది..#VarahiVijayaYatra pic.twitter.com/z64yehWr2Z
— JanaSena Party (@JanaSenaParty) June 25, 2023
వైసీపీ అవినీతి గురించి చదివి చదివి కళ్లజోడు వచ్చిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయి.. కానీ ఎంతమందికి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అందరి దగ్గర డబ్బు తీసుకుని మీ ఓటర్లకే వాటిని ఇస్తే ఎలా అని నిలదీశారు. ప్రభుత్వ ఖజానాను అందరికీ సమానంగా పంచాలని సూచించారు. 70 శాతం మంది ప్రజల అనైక్యత వల్ల.. 30 శాతం మంది మద్దతున్న వారు గెలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వ్యక్తి కాదని స్పష్టం చేశారు.
రౌడీలు, గుండాలకు భయపడే వ్యక్తిని కానని.. తానొక విప్లవకారుడిని అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటివరకు విప్లవ పంథాలో ఉన్న నాయకుడిని చూడలేదు. ఇకపై చూస్తారని స్పష్టం చేశారు. జగన్ అంటే తనకు వ్యక్తిగత ద్వేషం లేదని తెలిపారు.