అమరావతి : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) కుటుంబం భూఅక్రమాలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకుంటామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy ) వెల్లడించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో వైసీపీ నాయకులు (YCP Leaders) లక్ష 3వేల ఎకరాల భూఅక్రమాలకు పాల్పడ్డారని, వీటి విలువ సుమారు 35 వేల నుంచి రూ. 40 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. పెద్దిరెడ్డి చెరువులు, వాగులు, వంకలకు చెందిన భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పుంగనూరు, తమ్మల్లపల్లి, మదనపల్లె క్వారీల(Quarries) కు ఉపయోగిస్తున్న వాహనాలకు దొంగనంబర్లు వేసి నడిపారని ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీ అధికారం కోల్పోవడంతో వీటిని ఇతర రాష్ట్రాల్లోని గోడౌన్లో దాచిపెట్టారని పేర్కొన్నారు. వీటిపై కూడా రవాణా శాఖ విచారణ చేపడుతుందని స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో ఎంతో మంది టీడీపీకి చెందిన నాయకులకు గన్మెన్ల(Gunmens) ను తొలగించారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు గన్మెన్లను ఉంచడం, అధికారంలో లేనప్పుడు గన్మెన్లను తొలగించడం సహజసిద్ద ప్రక్రియని తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబం వల్ల నష్టపోయిన బాధితులు వారిని గ్రామాల్లో నిలదీస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకులు దాడులకు పాల్పడుతున్నారని చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు.