Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్వామివారి ఆలయం వెనుక భాగంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షోడశోపచార పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ స్వామిని పూజించడం వల్ల వివాహం జరగని వారికి.. పెళ్లవుతుందని, సంతాన కలుగుతుందని భక్తుల విశ్వాసం. సాయంత్రం సంధ్యా సమయంలో ఆరుబయటనున్న బయలు వీరభద్ర స్వామికి వివిధ రకాల జలాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రదోషకాలంలో ఆలయంలోని నందిమండపంలో కొలువైన శనగల బసవన్నకు పంచామృత అభిషేకాలు, ఫలోదకాలు, వివిధ రకాల శుద్ధ జలాలతో పాటు మల్లికా గుండంలోని జలాలతో అభిషేకం చేశారు. అనంతరం వృషభ సూక్తం పురుష సూక్తం పఠించి శనగలు నైవేద్యంగా సమర్పించారు. లోక కల్యాణం కోసం దేవస్థానం వారు సర్కారీ సేవగా ప్రతి మంగళవారం విశేష పూజలు జరిపిస్తున్నట్లు ఈవో వివరించారు.