అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో దారుణ ఘటన చోటు చేసుకుంటుంది. గుంటూరు పట్టణ శివారు నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలో లారీ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. చిత్తు కాగితాలు ఏరుకునే మహిళపైకి లారీ ఎక్కించి ప్రాణాలు తీశాడు.
వివరాల్లోకి వెళ్తే.. 40 ఏండ్ల వయసున్న రమణ అనే మహిళ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం గడుపుతోంది. ఇవాళ ఉదయం రమణ తన పిల్లలతో కలిసి చిలుకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లేందుకు లారీని ఆశ్రయించింది. దీంతో లారీ డ్రైవర్‌ను వారిని ఎక్కించుకుని గుంటూరు శివారులోని నాయుడుపేట వద్ద ఆపాడు.
అనంతరం రమణ మొదట లారీ నుంచి దిగి డ్రైవర్‌కు ఛార్జి నిమిత్తం రూ. 100 ఇచ్చింది. అయితే రూ. 300 ఇవ్వాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. తనతో అంత డబ్బు లేదని బాధితురాలు వాపోయింది. అతను ఆమె మాటలను వినిపించుకోకుండా.. పిల్లలు లారీలో ఉండగానే ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో రమణ లారీ టైర్ల కింద పడినప్పటికీ అలాగే ముందుకు కదలడంతో ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ నిర్వాకం వల్లే రమణ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.