AP News | తన కోరిక తీర్చుకునేందుకు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోయాడో యువకుడు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయం దాచి ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. మరో నిమిషం అయితే.. ఆ అమ్మాయి జీవితం బుగ్గిపాలయ్యేదే.. కానీ అంతలోనే రంగంలోకి వచ్చిన హెచ్ఐవీ ప్రాజెక్ట్ అధికారులు పెళ్లిని ఆపేశారు. పెళ్లి కొడుక్కి ఉన్న మాయరోగం గురించి అందరిముందు బట్టబయలు చేశారు. పెళ్లి కూతుర్ని కాపాడారు. ఏపీలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ యువకుడు (35)కి 2013లో హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి మందులు వాడుతూ, డైట్ మెయింటైన్ చేయడంతో ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ క్రమంలో సదరు యువకుడు ఓ యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. తాడేపల్లి క్రిస్టియన్పేటలోని ఓ చర్చిలో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
ఇక రింగులు మార్చుకుని పెళ్లితంతు పూర్తవుతుందన్న సమయంలో అక్కడకు హెచ్ఐవీ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్సన్ తన సిబ్బందితో కలిసి వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. ముందుగా వరుడికి ఉన్న హెచ్ఐవీ గురించి చర్చి పాస్టర్కు వివరించారు. ఆ తర్వాత వధువు కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. దీంతో వాళ్లు పెళ్లిని నిలిపివేశారు. హెచ్ఐవీ ఉన్న వ్యక్తికి పెళ్లి చేసి ఓ అమ్మాయి గొంతు కోయలేమని చర్చి పాస్టర్ ఖరాఖండీగా చెప్పేశారు.
వివాహం ఆగిపోవడంతో పెళ్లి కొడుకు బంధువులు పెళ్లి కూతురి బంధువులతో గొడవకు దిగారు. హెచ్ఐవీ ఉందని ఎందుకు దాచారని పెళ్లి కూతురు బంధువులు నిలదీయడంతో నీళ్లు నమిలారు. అనంతరం హెచ్ఐవీ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు సిబ్బందితో పాటు అక్కడ ఉన్నవారిపై పెళ్లికొడుకు బంధువులు దాడికి పాల్పడ్డారు. గొడవ ముదరడంతో చర్చి ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన తాడేపల్లి పోలీసులు.. ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ప్రతినిధులు కోరారు. హెచ్ఐవీ ఉన్న వ్యక్తిని బాధితుడిగా చూస్తామని.. అతని విషయంలో గోప్యత పాటిస్తామని తెలిపారు. అలా అని తనకు ఉన్న వ్యాధి గురించి చెప్పకుండా ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు.