కడప : తన కోరిక తీర్చేందుకు నిరాకరించిందన్న కోపంతో ఓ వ్యక్తి సదరు మహిళను విచక్షణారహితంగా కొట్టాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆమెను రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే దవాఖానలో కోలుకుంటున్నది. ఈ ఘటన కడప నగరానికి సమీపంలోని వైఎస్ఆర్ లేఅవుట్లో చోటుచేసుకున్నది.
పాలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ మహిళపై వైఎస్సార్ లేఅవుట్‌కు చెందిన వ్యక్తి కిరణ్ కన్నుపడింది. తన కోరిక తీర్చాలంటూ ఆమె వెంటపడ్డాడు. అలాంటి వేషాలు తన వద్ద వేయద్దని ఆమె తీవ్రంగా హెచ్చిరించింది. అయినప్పటికీ ఆమెను విడిచిపెట్టని కిరణ్.. ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం ఆ మహిళ పాలు పోసి తిరిగి వస్తుండగా అటకాయించిన కిరణ్.. తన కోరిక తీర్చవెందుకు అని ప్రశ్నిస్తూ కొట్టడం మొదలుపెట్టాడు. ఆమెపై లైంగికదాడికి దిగేందుకు యత్నించగా ప్రతిఘటించింది. తీవ్రంగా దెబ్బలు తిన్న సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. తెలిసినవారి ద్వారా సమాచారం అందుకున్న ఆమె కుటుంబీకులు… కడప రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.
కోరిక తీర్చాలంటూ గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నాడని, ఆయనకు సహకరించకపోవడం వల్లనే తనపై దాడి చేసి కొట్టాడని బాధితురాలు వాపోయింది. కిరణ్ అనే వ్యక్తి గాయపర్చడంతో జీవనాధారానికి దూరం కావాల్సి వస్తున్నదని విచారం వ్యక్తం చేసింది. తన విషయంలో పోలీసులు తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నది. బాధితురాలుకు ఇద్దరు సంతానం ఉన్నది. ఇలాఉండగా, ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇప్పటికే చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరుపనున్నారు.