Skull Damage | హైదరాబాద్ : ఓ ఉపాధ్యాయుడి నిర్వాకం బాలికను ప్రమాదకర స్థితిలోకి నెట్టింది. అల్లరి చేస్తోందని ఆ బాలిక తలపై స్కూల్ బ్యాగుతో కొట్టగా.. ఆమె పుర్రె ఎముక చిట్లిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో గత బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పుంగనూరు పట్టణానికి చెందిన హరి, విజేతల కుమార్తె సాత్విక నాగశ్రీ(11) స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతుంది. అయితే ఈ నెల 10వ తేదీన తరగతి గదిలో నాగశ్రీ అల్లరి చేసింది. అక్కడే ఉన్న హిందీ ఉపాధ్యాయుడు.. ఆమె తలపై స్కూల్ బ్యాగుతో బలంగా కొట్టాడు. దీంతో బాధిత బాలిక గట్టిగా ఏడ్చేసింది. అదే స్కూల్లో తల్లి విజేత పని చేస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు.
అయితే గత మూడు రోజుల నుంచి తలలో తీవ్రమైన నొప్పి వస్తుందని బాలిక తన తల్లికి చెప్పింది. స్కూల్కు వెళ్లేందుకు ఇష్టపడలేదు. మొత్తానికి బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి, వైద్యులు స్కానింగ్ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. బాలిక పుర్రెలోని ఎముక చిట్లిపోయినట్లు నిర్ధారించారు. ఇది తలనొప్పి కారణమైందన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, తలనొప్పి మాత్రం తీవ్రంగా వేధిస్తుందని తల్లిదండ్రులు తెలిపారు. సోమవారం రాత్రి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.