అమరావతి : ఏటీఎంలో డబ్బుల చోరీకి వచ్చిన దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దొంగలు కాల్పులు జరిపిన వైనం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్లో హర్యానా దొంగల ముఠా బుధవారం రాత్రి ఏటీఎం చోరీకి ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులను చూసి దొంగలు గ్యాస్కట్టర్లు, స్పానర్లు వదిలి పారిపోయారు.
వెంబడించిన పోలీసులపైకి దొంగలు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినా పోలీసులు దొంగలను వెంబడించి ముఠాలోని ముస్తఫా, తాహేర్ అనే దొంగలను పట్టుకోగా మరో నలుగురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మిగతా సభ్యుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.