అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా కేంద్రంలో బ్యాంక్ దోపిడీ ( Bank robbery ) విఫలయత్నం జరిగింది. బ్యాంక్ మహిళా మేనేజర్ ( Female Manager ) సకాలంలో స్పందించడంతో దొంగలు కాలికి బుద్ధిచెప్పారు.
వివరాలు ఇలా.. అనకాపల్లి రింగ్ రోడ్డులో ఉన్న కెనరా బ్యాంక్ ( Canara Bank ) లో దోపిడీ చేయడానికి 7గురు సభ్యులు గల ముఠా రెండు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. వీరిలో నలుగురు లోనికి వెళ్లగా మరో ఇద్దరు బ్యాంక్ బయట కాపలాగా ఉన్నారు. లోనికి వెళ్లిన దొంగలు మహిళా మేనేజర్‌పై తుపాకి గురి పెట్టి నగదు, నగలు ఇవ్వాలని బెదిరించారు.
వెంటనే మేనేజర్ అలారం నొక్కడంతో దొంగలు అక్కడి నుంచి పారి పోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదనపు ఎస్పీ మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.