Suicide | కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తొలిరాత్రికి ఏర్పాట్లు కొనసాగుతుండగానే.. మరో వైపు ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల కుమార్తె హర్షిత(22)కు కర్ణాటకలోని దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా పెళ్లి జరిగింది. ఇక సోమవారం రాత్రికే ఆ నవ దంపతులకు ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో హర్షిత తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తొలిరాత్రికి సమయం సమీపిస్తుండడం.. హర్షిత ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు పగులగొట్టారు.
విగతజీవిగా పడి ఉన్న నవ వధువును పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే హర్షిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. బాధిత కుటుంబ సభ్యులెవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నవ వధువు ఆత్మహత్యతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.