అమరావతి : ఏపీ ప్రజలకు అనేక హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుపై (Chandra Babu) 420 కేసు ఎందుకు నమోదు చేయవద్దని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు నెరవేర్చని కూటమి నాయకుల కాలర్ పట్టుకునే రోజులు దగ్గర్లో ఉన్నాయని అన్నారు.
గత ఎన్నికల్లో తాను అబద్దాలు చెప్పలేకపోవడం వల్ల కూటమి కంటే మనకు 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని, అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీత, విలువలు ఉండాలని వెల్లడించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం , పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక (Sand), మద్యం(Liquor), పేకాట మాఫియాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
వైసీపీ హయాంలో కరోనా వల్ల కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయామని, ఇకపై జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు పెద్దన్నగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్యాయాలు ఎవరూ చేసినా వదిలిపెట్టబోమని, వారిని చట్టం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి , నియోజకవర్గాల సమన్వయ కర్తలు పాల్గొన్నారు.