AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ బాలికను అదే గ్రామంలో జులాయిగా తిరిగే సురేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఈ విషయాన్ని సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు సురేశ్‌ను మందలించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేశ్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
జైలు నుంచి 20 రోజుల క్రితం బయటకొచ్చిన సురేశ్ బాలికపై కోపం పెంచుకున్నాడు. నిన్న సాయంత్రం బాలిక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన సురేశ్ ఇంట్లోకి చొరబడ్డాడు. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అప్పుడే బాలిక నానమ్మ ఇంటికి రావడంతో సురేశ్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. సురేశ్‌ను చూసి భయాందోళనలతో ఇంట్లోకి వెళ్లిన నానమ్మకు రక్తపు మడుగులో పడివున్న మనమరాలు కనిపించింది. దీంతో నానమ్మ గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్‌తో నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
బాలిక హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళికృష్ణకు కాల్ చేసి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.