Pulivendula | జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందుల నియోజకవర్గగంలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటన్నింటినీ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో జడ్పీటీసీ ఎన్నికల కోసం పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పులివెందులలో 550 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి.
పులివెందుల, ఒంటిమిట్టలో ఉప ఎన్నిక నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రెండు ప్రాంతాల్లో 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొ్న్నారు. పులివెందులలో ఇప్పటికే 550 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని తెలిపారు. అనుమానిత వ్యక్తులపై పోలింగ్ రోజు గృహ నిర్బంధం చేస్తామని పేర్కొన్నారు. మీడియాపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచుతామని చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో.. 5 గంటల తర్వాత నుంచి స్థానికేతరులు గ్రామాల్లో ఉండటానికి వీల్లేదని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తామని వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.