భీమవరం: పేదలకు ఇళ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రూ.5 వేల కోట్లు దోచాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతున్నదని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. దీనిపై బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తక్కువ ధరకే ఇసుక అందిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీరు వల్లనే అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పడితే ప్రత్యక్షంగా 2 లక్షల మందికి, పరోక్షంగా మరో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చేరువవుతాయని చెప్పారు. టిడ్కో ఇళ్లను కేంద్ర ప్రభుత్వ సాయంతో పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరే విషయంపై మీడియా ప్రశ్నించగా.. ఆయన విషయంలో ఏదైనా జరగొచ్చని సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ నాయకులతో ఆయన టచ్లో ఉన్నారని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ వెంకటసత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.