తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల గోవిందానామ స్మరణతో తిరుమల కొండ మారుమ్రోగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు.వీరికి 36 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీవర్గాలు వెల్లడించాయి.
నిన్న 69,814 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,228 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.
డిసెంబర్ నెల వర్చువల్ సేవా టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ నెలకు సంబంధించి వర్చువల్ సేవ సంబంధిత దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఇందులో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ, సంబంధిత దర్శన టికెట్లు ఉన్నాయని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.