Kommineni Srinivasa Rao | హైదరాబాద్, జూన్ 10, (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఏపీ రాజధాని అమరావతిని కించపరిచారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
ఓ టీవీ ఛానల్లో నిర్వహించిన చర్చ సందర్భంగా అమరావతి రాజధానిపై జర్నలిస్టు కృష్ణంరాజు అసభ్య వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో రాజధాని రైతులు, మహిళలు, ఏపీ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొమ్మినేనితో పాటు, జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని నివాసానికి వెళ్లి ఆయన్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.