సేంద్రియ సాగులో అతిపెద్ద సవాలు.. చీడపీడలే! వీటిని నిర్మూలించుకోకుంటే.. భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే! అయితే, ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా.. పురుగులను పురుగులతోనే నివారించుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ‘ట్రైకోగ్రామ’ పరాన్నజీవితో చీడపీడలను నివారించవచ్చని నిరూపిస్తున్నారు.
సేంద్రియ వ్యవసాయంపై రైతులు ఆసక్తి పెంచుకుంటున్నారు. రసాయనాలు వాడకుండా పంటలు పండించడానికి ముందుకొస్తున్నారు. అయితే, సేంద్రియ సాగులో చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వరి, మకజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడుతో పాటు కూరగాయల సాగులో వచ్చే పచ్చ పురుగులు, కాండం తొలుచు పురుగులు పంటలను తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. మొదటి దశ నుంచి చివరి పంటకోత దశ వరకూ పంటలపై దాడి చేసి, నాశనం చేస్తుంటాయి. వీటి నివారణకు రైతులు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. చేసేది లేక మళ్లీ రసాయన మందులు వాడటం తప్పనిసరి అవుతున్నది. ఈ సమస్యను అధిగమించడానికి మెదక్ జిల్లా వ్యవసాయ అధికారులు ‘ట్రైకోగ్రామ’ అనే పరాన్నజీవిని ఆశ్రయించారు. ఈ ఎరువును ఉపయోగించి కాండం తొలుచు పురుగును సమర్థంగా నియంత్రించారు. పంటల దిగుబడులను కూడా పెంచారు.
ప్రయోగాత్మకంగా..
వ్యవసాయ విస్తరణాధికారి నాగార్జున.. గతేడాది వానాకాలం సీజన్లో ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి కార్డులను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఇందుకోసం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన కుంభాల నగేష్ రెడ్డి వరిపొలాన్ని ఎంచుకున్నారు. దీన్ని వాడటం వలన కాండం తొలుచు పురుగు.. ఉధృతి తీవ్రంగా తగ్గినట్లు గుర్తించారు. సంప్రదాయ వ్యవసాయంలో ఒక ఎకరంలో కాయతొలుచు పురుగు నివారణ కోసం సుమారు రూ. 2వేల దాకా ఖర్చుపెడతారు. అయితే, ట్రైకోగ్రామ కార్డులను ఏర్పాటుచేయడం ద్వారా అతితక్కువ ఖర్చుతోనే చీడపీడలను నివారించడంలో వ్యవసాయ అధికారులు విజయం సాధించారు. అంతేకాకుండా రసాయనాల వాడకం వల్ల పంటకు మేలుచేసే మిత్ర పురుగులు కూడా చనిపోయే అవకాశం ఉన్నది. రసాయన మందుల ప్రభావంతో భూమి, గాలి, నీళ్లు కలుషితం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘ట్రైకోగ్రామ’ ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
గుడ్డు దశలోనే..
ప్రతి పురుగు జీవిత చరిత్ర.. గుడ్డు దశ, గొంగళి పురుగు దశ, నిద్రావస్థ దశ, రెకల పురుగు దశ అనే నాలుగు దశల్లో పూర్తవుతుంది. సహజసిద్ధంగా ప్రతి దశలోనూ శత్రు పురుగుల దాడులకు గురవుతూ ఉంటుంది. చీడపురుగుల గుడ్లమీద కొన్నిరకాల పరాన్న జీవులు దాడిచేసి, గొంగళి పురుగు దశకు చేరకుండానే నాశనం చేస్తాయి. వీటిని ‘గుడ్డు పరాన్న జీవులు’గా పిలుస్తారు. గుడ్డు దశను నాశనం చేసే పరాన్న జీవుల్లో ముఖ్యమైంది.. ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి. ఇవి వివిధ రకాల పంటలలో పలురకాల పురుగులపై గుడ్డు దశలోనే దాడిచేస్తాయి. వాటిని నాశనం చేస్తాయి. ఈ ట్రైకోగ్రామ పరాన్న జీవులు ఆశించిన గుడ్ల కార్డులను పంట పొలాల్లో ఏర్పాటుచేయడం వల్ల ఆశించిన ఫలితాలు దక్కుతాయి.
ట్రైకోగ్రామ వినియోగం
పంటపొలాల్లో రెకల పురుగు తిరుగుతున్నట్లు గమనించిన వెంటనే ట్రైకోగ్రామ కార్డులను వాడాలి. ఒక ట్రైకోగ్రామ కార్డులో సుమారు 18-20 వేల పరాన్నజీవులు ఉంటాయి. ఎకరానికి 4 కార్డులు నాలుగు దికుల్లో పెట్టడం వలన ఒక ఎకరంలో 80వేల పరాన్నజీవులు ఏర్పడతాయి. ఈ పరాన్నజీవులు కాండం తొలుచు పురుగు గుడ్లను వెతికి మరీ ఆ గుడ్ల లోపలికి వెళ్లి గుడ్లు పెడుతుంది. ఇలా గుడ్డు దశలోనే కాండం తొలుచు పురుగును నియంత్రించవచ్చు. ఎకరానికి నాలుగు లేదా ఐదు కార్డులను నాలుగు ముకలుగా చేసి.. అంటే 16 – 20 ముకలను పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. ఒక కార్డు రూ. 75 చొప్పున ఎకరానికి రూ. 500 దాకా ఖర్చవుతుంది. అదే రసాయన మందులు ఉపయోగిస్తే సుమారు రూ. 3 వేల దాకా ఖర్చవుతుంది.
ట్రైకోగ్రామ తయారీ
ట్రైకోగ్రామ తయారీకి బాగా ఎండిన జొన్నలు లేదా మకజొన్నలు మరపట్టించి, పిండిని ఆరబెట్టాలి. ప్రత్యేకంగా తయారుచేసిన చెకడబ్బాలు లేదా గాజు జార్లలో ఆ పిండిని వేయాలి. బియ్యం, పురుగు గుడ్లను పిండిమీద చల్లి మూత పెట్టాలి. గాలి సోకడానికి వీలుగా రంధ్రాలు ఉన్న మూతలతో డబ్బాలను మూసేయాలి. గాజు జార్లలో అయితే పల్చటి గుడ్డను పూతగా ఉపయోగించాలి. సుమారు 40 రోజుల తర్వాత వీటినుంచి రెకల పురుగులు బయటికి రావడం మొదలవుతుంది. ప్రతిరోజూ పురుగులను సేకరించి, గుడ్లను పెట్టడానికి జల్లెడ అమర్చిన గరాటులో వేయాలి. తల్లి పురుగులు పెట్టిన గుడ్లలోంచి మంచిగుడ్లను వేరుచేయాలి. ఈ గుడ్లలో కొన్నిటిని పరాన్నజీవులను పెంచడానికి, మరికొన్నిటిని పిండి పురుగులను పెంచడానికి ఉపయోగించాలి.
ఈ గుడ్లను జిగురు రాసిన కార్డు(15×5 సెం.మీ.)ల పైన చల్లి, ఆరిన తర్వాత గాజు గొట్టాలు ఉంచాలి. ట్రైకోగ్రామ పరాన్నజీవులను ఈ కార్డులో ఉన్న గాజు గొట్టాల్లో వదిలి, దూదితో మూసేయాలి. పరాన్నజీవులకు తేనెను ఆహారంగా వేయాలి. తర్వాతి రోజు గుడ్లను వేరొక గాజు గొట్టాల్లోకి మార్చి, మళ్లీ దూదితో మూసేయాలి. నాలుగో రోజుకు పరాన్నజీవి గల గుడ్లు నలుపు రంగులోకి మారుతాయి. ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల్లో ఈ కార్డుల నుంచి ట్రైకోగ్రామ పురుగులు బయటికి వస్తాయి. ఈ పరాన్నజీవులను పంట పొలాల్లో వాడుకోవాలి. కార్డులను చిన్నచిన్న ముకలుగా చేసి, పొలాల్లో ఐదు మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి.
మంచి ఫలితాలు..
ట్రైకోగ్రామ కార్డు వాడకం వల్ల సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు మంచి ఫలితాలు పొందుతున్నారు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగును ఎటువంటి రసాయనాలు లేకుండా సమర్థంగా నియంత్రించవచ్చు. అదేవిధంగా సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులు, రసాయన పురుగులకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ట్రైకోగ్రామతో ఈ ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. అయితే, ట్రైకోగ్రామ అమర్చిన పంటలో ఎటువంటి రసాయన మందులను పిచికారీ చేయవద్దు.
-నాగార్జున, వ్యవసాయ విస్తరణ అధికారి.
మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి