Sore throat disease | మన రాష్ట్రంలో జోరుగా వానలు కురిశాయి. ఈ నేపథ్యంలో దోమలు, జోరీగలు, పిడుదులు, గోమార్ల ఉద్ధృతి ఉండటం సహజం. ఇలాంటి ప్రతికూల వాతావరణ యాజమాన్య పరిస్థితుల్లో పశువుల్లో ముఖ్యంగా పాడి పశువుల్లో గొంతువాపు వ్యాధి లేదా గురకవ్యాధి వ్యాపించి ఇబ్బంది పెడుతున్నది. బర్రెలతోపాటు ఆవులు, మేకలు, గొర్రెలు, గాడిదలు పాశ్చురెల్లా హిమోలైటికా అనే బ్యాక్టీరియా కారణంగా ఈ ప్రాణాంతక వ్యాధికి గురవుతున్నాయి. ఫలితంగా పాడి గేదెలు, దూడలు, పెయ్యలు , దున్నలు అకాలంగా చనిపోతున్నాయి. ఈ వ్యాధి నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పాడి పశువులను కాపాడుకోవచ్చు.
తాగునీరు, కలుషిత వాతావరణం, అనారోగ్య పశువుల స్పర్శ, మేత, పరికరాలు, ఈగలు, జోరీగల ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వరదల కారణంగా నిలిచిపోయిన మురుగునీటిలో, అపరిశుభ్ర పశువుల పాకలు, వాటి పరిసరాలు ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారకాలు. ఈ వ్యాధి ముఖ్యంగా శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పశువుల గొంతు, మెడ కింది భాగంలో వాపు కనిపిస్తుంది. రక్తంలోకి చేరి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
లక్షణాలు
ఈ వ్యాధి కారకాలు పశువుల శరీరంలోకి ప్రవేశించిన 8-32 గంటల వ్యవధిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏ లక్షణం కనిపించకుండానే ఆకస్మికంగా మరణిస్తుంటాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే సరైన చికిత్స అందించాలి.
మేత, నెమరు మందగించుట, పాలు నిలిచిపోవుట, గొంతు కింది భాగంలో జలవాపు ప్రారంభమై క్రమంగా మెడ కింది భాగానికి.. ఆ తర్వాత కాళ్ల మధ్య ఎదురు రొమ్ము కిందికి చేరుతుంది. పశువు తీవ్రమైన ఆయాసంతో రొప్పుతూ గురకపెడ్తూ ముక్కు నుంచి, నోటి నుంచి నురగ వంటి స్రావాలను కారుస్తుంటుంది. చెవి ప్రాంతంలో విపరీతమైన వేడి ఉంటుంది. కళ్లు ఎర్రగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో చాక్లెట్ రంగులో కనిపిస్తాయి.
వ్యాధి నిర్ధారణ
ఈ వ్యాధికి గురైనట్లు తెలుసుకునేందుకు పశువుల రక్తపు నమూనాలు సేకరించి పరీక్షలు జరుపడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. సకాలంలో సరైన చికిత్స అందించడంతోపాటు టీకాలు వేయడం వంటి నివారణ చర్యలు తీసుకోవాలి. శరీరం లోపలి అవయవాల్లో కనిపించే మార్పుల వల్ల కూడా వ్యాధి నిర్ధారణ చేస్తే మరీ మంచిది.
చికిత్స
ఈ వ్యాధికి గురైన పశువులకు బాగా విశ్రాంతినివ్వాలి. రోజుకు నాలుగైదు సాంబ్రాణి దూపం వేసి పీల్చుకునేలా చేస్తే ఉపశమనం ఉంటుంది. చికిత్స అందించేందుకు పేడను దాచిపెట్టాలి. బంధించాల్సి వస్తే శ్వాసకు ఇబ్బంది లేకుండా సున్నితంగా బంధించాలి. ఎన్రోఫ్లాక్సిసిన్ సిప్రోప్లాక్ససిన్ జెంటామైసిన్, సల్ఫా పెన్సిలిన్ వంటి ఏదైనా యాంటీ బయోటిక్ ఇంజక్షన్లను వరుసగా కనీసం 3,4 రోజులు ఇవ్వాలి.
ఈ వ్యాధికి గురైన పశువును గుర్తించగానే మిగతా పశువులకు దూరంగా ఉంచాలి. పశువుల పాకల్లోకి క్రిమికీటకాలు చేరకుండా శుభ్రంగా ఉంచాలి. పొడిసున్నం, గెమాక్సిన్, డీడీటీ, సైపర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్ వంటి కీటకనాశకాలను స్ప్రేచేయాలి.
చనిపోయిన పశువుల కళేబరాలను, వాటి వ్యర్థాలను కొట్టాలకు దూరంగా భూమి లోతుగా తవ్వి పాతిపెట్టాలి. వీటిని పచ్చికబీడ్లు, పంట భూములు, చెరువులు, వాగులు, కాల్వల్లోకి వదకుండా చూసుకోవాలి.
వానాకాలం రాగానే పశువుల్లో గురక వ్యాధి లేదా గొంతు వాపు వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో చికిత్స అందించడం ద్వారా ఇతర పశువులకు ఈ వ్యాధి సోకకుండా చూడవచ్చు.