backyard chickens | వ్యవసాయం, పాడి తరువాత స్థానం పెరటి కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో తొలుత చెప్పుకునేది పెరటి కోళ్ల పెంపకమే. దేశవాళీ కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉండే కోళ్లను ఇంటి పరిసరాల్లో పెంచుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో పెరటి కోళ్లను పెంచి ఆదాయం ఎలా పొందాలో తెలుసుకుందాం.
ఫారమ్ కోళ్ల కంటే పెరటి కోడి మాంసం ఎక్కువగా రావడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. వీటికి ప్రత్యేకంగా మేత వేయాల్సిన అవసరం కూడా ఉండదు. వ్యవసాయ వ్యర్థాలను మేతగా వేస్తే సరిపోతుంది. ఆరు బయట తిరుగుతూ ఆహారాన్ని గ్రహించడం వలన వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.
పెరటి కోళ్లలో రకాలు
వనరాజా, గిరిరాజా, గ్రామప్రియ, గ్రామలక్ష్మీ వంటి కొన్ని జాతుల కోళ్లను ఎంచుకుంటే మంచి లాభసాటిగా ఉంటుంది. ఇవి ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ఎక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. కోళ్లను ఎంపిక చేసిన అనంతరం అన్ని రకాల టీకాలు వేయించాలి. ఐదారు వారాల కోడిపిల్లకు టీకాలు వేయించడం ద్వారా వాటికి రోగాలు దరిచేరవు.
దాణా, టీకాలు
కోడి పిల్లలకు 28 రోజుల వయస్సు వచ్చే వరకు దాణా అందించాలి. ఈ దాణా స్థానికంగా లభించే వ్యర్థాలతో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న రవ్వ. గింజలు ఆహారంగా ఇవ్వవచ్చు. పిల్లలు పెరిగే కొద్దీ నీటి తొట్టెలు, మేత తొట్ల సంఖ్య కూడా పెంచుకోవాలి . పెరటి కోళ్లకు న్యూకాస్టల్, ఫౌల్ ఫాక్స్ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. వీటి నివారణకు 8 నుంచి 9 వారాల పిల్లలకు టీకాలు వేయించాలి.
గుడ్లు పెట్టడం
పెరటి కోళ్లు 42 రోజుల వయస్సులో 650 – 750 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. పెట్ట కోళ్లను గుడ్ల ఉత్పత్తి కోసం వేరుచేయాలి. 20 నుంచి 10 కోళ్ల గుంపులో ఒకటి నుంచి రెండు పుంజులు ఉండేలా చూడాలి. ఆరుబయట ఉండటం వలన పరాన్న జీవుల సమస్య వచ్చే అవకాశం ఉన్నందున.. రెండు, మూడు నెలల మధ్య నట్టల నివారణ మందులు వాడాలి. జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా 150-170 గుడ్లు పెడతాయి
వనరాజా కోళ్లు 150 వరకు గుడ్లు పెడతాయి. మేతలో జాగ్రత్తలు పాటిస్తే మరిన్ని అధికంగా పొందవచ్చు. గిరిజా కోళ్లు ఆహారం ఎక్కువ తీసుకుంటాయి. అయిదున్నర వారాల వయస్సులో గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి. గిరిజా కోడి గుడ్లను నాటుకోళ్ల కింద పొదిగించ వచ్చు. రాజశ్రీ కోళ్లు 8 వారాల్లో పిల్లలు 500 గ్రాముల బరువు తూగుతాయి. ఏడాదిలో ఈ కోళ్లు 160-170 గుడ్లు పెడతాయి. మార్కెలో వీటి గుడ్లు, మాంసానికి డిమాండ్ ఉంటుంది.