Pests in oil palm | ఆయిల్ పామ్ దీర్ఘకాలపు పంట. మొక్కలను త్రిభుజాకారపు పద్ధతిలో 9 మి. దూరంతో నాటుతారు. ఆయిల్ పామ్ తోటలను మెట్ట ప్రాంతాల్లోని అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. నేలలు అధిక సేంద్రీయత కలిగిఉండి నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండాలి. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలు చాలా అనువైనవి. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా పెరుగుతుంది. నీటి పారుదల సౌకర్యం ఉన్నప్పుడు మంచి దిగుబడి వస్తుంది. సూర్యరశ్మి రోజుకు 5 గంటల పాటు ఉండేలా చూడాలి. గాలిలో తేమ 80 శాతం కంటే ఎక్కువగా ఉండాలి.
తెగుళ్లు రకాలు
ఆయిల్ పామ్‌లో కాండము మొదలు కుళ్ళు తెగులు, మొవ్వు కుళ్ళు తెగులు, కాండము తడి తెగులు, నారింజ మచ్చలు, గెల కుళ్ళు తెగులు, కాండము పైభాగం కుళ్ళు తెగులు, స్పియర్ రాట్, పండ్ల కుళ్ళు తెగులు, మొవ్వు తెగులు, మొవ్వు విరుగుట, గెల చివర కుళ్ళు తెగులు, గెలలు రాకపోవడం వంటి వ్యాధులు కనిపిస్తాయి.
కొమ్ము పురుగు
ఆకుల చివర V ఆకారంలో ఖాళీలు ఏర్పడతాయి. తల్లి పురుగులు ఆకుల మట్టల కింద బెజ్జాలలో ఉండి నమిలివేసి పిప్పిని బయటకు నెడుతుంది. మొవ్వలో ఈ పీచును బట్టి పురుగు చేసిన నష్టాన్ని గుర్తించవచ్చు. దీని నివారణకు పెంటకుప్పల మీద కార్బరిల్ పిచికారి చేసి పిల్ల పురుగు పెరగకుండా నిరోధించాలి. మొవ్వలో నున్న పురుగును తీగతో తీసి 25 గ్రాముల కార్బరిల్ మందులను 10 గ్రాముల తడి ఇసుకలో కలపి మొవ్వలో పెట్టాలి.
సంచి పురుగు
శంఖు ఆకారంలో సంచుల్లో ఆకు అడుగున వేలాడుతూ ఆకులకు రంధ్రాలు చేస్తుంది. దీని నివారణకు పురుగు సోకిన ఆకులను కత్తిరింది తగులబెట్టాలి. మోనోక్రోటోఫాస్ 10 మిలీ ల నీటికి కలిపి వేరు ద్వారా చెట్టుకు ఎక్కించాలి.
మొవ్వ కుళ్లు తెగులు
ఈ తెగులు వానాకాలంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. మొవ్వ పసుపు రంగులోకి మారి లాగితే తేలికగా ఊడి వచ్చేస్తుంది. కుళ్లిన భాగాల నుంచి చెడు వాసన వస్తుంది. దీని నివారణకు మొవ్వలోని రోగం సోకిన భాగాన్ని తొలగించి కార్బండైజిమ్ 20 గ్రాములకు 100 మి లీ ల నీటిని కలిపి పల్చటి ముద్దలా చేసి పూయాలి. దీనితో పాటు మోనోక్రోటోఫాస్ 1 మి.లీ కు 1 లీటర్ నీటిలో కలిపి తెగులు సోకి శుభ్రపరిచిన ప్రాంతంలో పిచికారి చేయాలి.
గెల కుళ్లు తెగులు
తెగులు ఆరంభ దశలో శిలీంద్రం గెలలోని పండ్ల కింద, మధ్యభాగానికి సోకుతుంది. శిలీంధ్రం వెనుక భాగం నుంచి తడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది. తెగులు తీవ్రం కాగానే గెలంతా వ్యాపించి గెల కుళ్లిపోయేలా చేస్తుంది. ఇలాంటి గెలలను నరికి వేసి 0.1 శాతం కార్బండైజిమ్ మందుతో శుద్ధి చేయాలి. రాగి ధాతు ఆధారిత శిలీంధ్రనాశనుల్ని వాడరాదు.
కాండం తడి తెగులు
ఈ తెగులు సోకిన చెట్ల మొవ్వ ఆకస్మాత్తుగా వడిలిపోయి మిగిలిన ఆకులు పసుపు రంగులోకి మారి ఊడిపోతాయి. దీని నివారణకు కాండానికి శస్త్రచికిత్స చేసి కుళ్లిన పదార్థాన్ని తీసివేసి కార్బండైజిమ్ మోనోక్రోటోఫాస్ల పూత పూసి పై పూతగా తారును పూయాలి.